రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు 16 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. శని, ఆదివారాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. ఆది, సోమవారాల్లో ఆదిలాబాద్, కుముంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వానలు కురుస్తాయని తెలిపింది.
ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. మిగతా ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, రేపు, ఎల్లుండి అధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
మరోవైపు ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఏకధాటి వానకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం పూట కళాశాలలు, కార్యాలయాలు, ఇతర పనులపై వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.