సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం జరిగిన భవనం కూల్చివేతకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డెక్కన్ స్పోర్ట్స్ వేర్ భవనం కూల్చివేతకు సంబంధిత అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఇద్దరి ఆచూకీపై స్పష్టత రాగానే కూల్చివేత ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 1890 చదరపు అడుగుల్లో ఉన్న డెక్కన్ స్పోర్ట్స్ వేర్ భవన నిర్మాణం కూల్చివేతకు రూ.33.86 లక్షలతో అధికారులు టెండర్లు పిలిచారు.
డెక్కన్ స్పోర్ట్స్ వేర్ భవనం కూల్చివేతకు ఆధునాతన యంత్రాలను సమకూర్చాలని టెండర్లలో సూచించారు. భవనం చుట్టుపక్కన నివాసాలు ఉండడంతో వాటికి ఎలాంటి ప్రమాదం జరుగకుండా ఉండేలా కూల్చివేత పనులు చేయాలని అధికారులు నిర్ణయించారు. భవనం చుట్టూ తార్పాలిన్ ఏర్పాటు చేసి కూల్చివేయనున్నట్లు తెలిపారు.
భవనంలో ఉన్న ఇద్దరి ఆచూకీ విషయమై పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఉత్తరాలు రాస్తున్నారు. సెల్లార్‌తో సహా అన్ని అంతస్తులను కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. కూల్చివేత సందర్భంగా 20కేఎంటీఎస్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు అంచనా వేస్తున్నారు.