రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులకు ఝలక్.. ప్రమోషన్లపై హైకోర్టు స్టే..!

-

రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులకు తెలంగాణ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఉపాధ్యాయుల ప్రమోషన్లపై స్టే విధించింది హై కోర్టు. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల ప్రమోషన్లపై శనివారం న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో సీనియారిటీ జాబితాపై ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జీవో 317 ద్వారా ఇతర జిల్లాల ఉపాధ్యాయులను రంగారెడ్డి జిల్లాకు కేటాయించారని పిటిషనర్లు వాదించారు. రంగారెడ్డి జిల్లా క్యాడర్ కన్నా ఎక్కువ టీచర్లను కేటాయించినట్టు తెలిపిన పిటిషనర్లు.. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాథమిక సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలకు తగిన సమయం ఇవ్వకుండా పదోన్నతులకు సిద్ధమయ్యారని పిటిషనర్లు చెప్పుకొచ్చారు.

అభ్యంతరాలను పరిశీలించాకే తుది సీనియారిటీ జాబితా రూపొందిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. తుది సీనియారిటీ జాబితా ఇవ్వకుండా పదోన్నతులు ఇవ్వబోమని తెలిపారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు ఈ నెల 19 వరకు తమకు సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. దీంతో విద్యాశాఖ కార్యదర్శి, డీఎస్‌ఈ, రంగారెడ్డి డీఈఓకు హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ప్రాథమిక సీనియారిటీ జాబితా ఆధారంగా పదోన్నతులు ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news