తెలంగాణ రాష్ట్రంలో టీఆరెస్ లేనే లేదని.. అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ఈడీ ఆఫీస్ ముందు మహా ధర్నా చేపట్టారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ఈడీ ఆఫీస్ వరకూ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ.. అదానీ మెగా కుంభకోణం పై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయ్యాలని.. దీనికి ముందే సెబీ ఛైర్మన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దోషులు తప్పించుకునే వీలున్నందున, వారికి వెంటనే శిక్షను విధించాలనే తాము ఈ ఆందోళన చేస్తున్నట్లు వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్లాక్ మనీ తెస్తానని, పేదల ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తానని చెప్పి.. ఇప్పుడు 15 పైసలు కూడా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి.