కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని
ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మి తీవ్రంగా నష్టపోయారని అన్నారు. పాపం అని కాంగ్రెస్కు అధికారం ఇస్తే.. రాష్ట్ర ప్రజల చేతిలో చిప్ప పెట్టారని విమర్శించారు. రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ, అసంబద్ధ హామీలు నమ్మి ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టుకున్నారని అన్నారు. “ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ ని తిప్పికొట్టాలి” అని ప్రజలను సూచించారు.
ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ని తిరస్కరించండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డి మాత్రం ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమేనని పేర్కొన్నారు.