తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది అవతరణ దినోత్సవం కావడంతో వేడుకలను ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఆహ్వానించారు. ఆ క్రమంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని గాంధీ భవన్ వర్గాలు స్పష్టతనిచ్చాయి. అనారోగ్యం, ఎండల కారణంగా వైద్యుల సూచన మేరకు ఆమె తన షెడ్యూలు విజిట్ ను రద్దు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు వీడియో సందేశాన్ని వినిపించనున్నారు. ఆ మెసేజ్ ను పరేడ్ గ్రౌండ్స్ వేదిక మీద భారీ ఎస్ఈడీ స్క్రీన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించనున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పడి పదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.
రేపు జరిగే ఈ వేడుకల కోసం పరేడ్ గ్రౌండ్స్ ముస్తాబు అవుతోంది. ఈ కార్యక్రమానికి 20 నుంచి 25 వేల మంది హాజరయ్యేలా పరేడ్ గ్రౌండ్స్ లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి జూన్ 2న ఉదయం 9.30 గంటలకు గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని 10 గంటల సమయంలో పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. తదనంతరం డ్డి నివాళులు అర్పిస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని పోలీస్ బలగాల కవాతు, మార్చ్ ఫాస్ట్ తో పాటు పోలీసుల గౌరవ వందనం ఉంటుంది. తర్వాత 10.35 గంటల సమయానికి తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండనుంది. పోలీస్ సిబ్బందికి, ఉత్తమ అధికారులకు అవార్డులు అందజేయనున్నారు. వీరి ఫోటో సెషన్ తర్వాత కార్యక్రమం ముగియనుంది. ఇక రేపు సాయంత్రం ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభం కానున్నాయి.
ఈ కార్యక్రమానికి సాయంత్రం 6.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు, అధికారులు హజరుకానున్నారు. వేడుకల్లో భాగంగా తెలంగాణ సాంప్రదాయానికి అద్దం పట్టేలా ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, ఫుడ్ స్టాళ్లను రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. అనంతరం 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు హాజరు అవుతారు. దీని తర్వాత ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసిన స్టేజీపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. అనంతరం ట్యాంక్ బండ్ పై జాతీయ జెండాలు పట్టుకున్నా 5 వేల మందితో భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జయ జయహే తెలంగాణ పూర్తి వెర్షన్ (13.30 నిమిషాలు) పాటను విడుదల చేయనున్నారు. ఈ పాటకు ప్రాణం పోసిన తెలంగాణ కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణిని సీఎం సన్మానిస్తారు. రాత్రి 8.50 గంటలకు హుస్సేన్ సాగర్ పై అకాశంలో పది నిమిషాల పాటు పేల్చే బాణసంచా కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి.