టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సంగారెడ్డి మున్సిపాలిటీ పాలకవర్గం నుంచి ముగ్గురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ ను వీడారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 7వ వార్డు కౌన్సిలర్ బోయిని విజయలక్ష్మి శేఖర్, 19వ వార్డుకు చెందిన చాకలి స్వప్న నర్సింహులు, 28వ వార్డు కౌన్సిలర్ ఉమామహేశ్వరీలు కాంగ్రెస్ లో చేరారు. మంగళవారం సంగారెడ్డిలో వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వలసలు జోరందుకున్న విషయం విధితమే.
కొండాపూర్ మండల ఎంపీపీ మనోజ్ రెడ్డి, పీఏసీఎస్ గొల్లపల్లి చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి బీఆర్ఎస్ ను వీడారు. దీంతో కొండాపూర్ మండలంలో బీఆర్ఎస్ లో కీలకనాయకులు కాంగ్రెస్ లో కలవడంతో బీఆర్ఎస్ కు కష్టకాలమని చెప్పవచ్చు. అదేవిధంగా సదాశివపేట, సంగారెడ్డి మండలాల నుంచి పలువురు బీఆర్ఎస్ నాయకులు జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఏర్పడింది. కాగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉంది.