సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్ రేపు (మే 13వ తేదీ 2024) జరగనుంది. ఈ విడతలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్లంతా సిటీల నుంచి పల్లెల బాట పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో సెటిల్ అయిన ఆంధ్రా ఓటర్లు తమ సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ముఖ్యంగా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. రేపు ఎన్నికలు ఉన్నందున సొంతూళ్లకు ఓటర్లు తరలి వెళ్తున్న నేపథ్యంలో ఈ రద్దీ ఏర్పడింది. మరోవైపు హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్బీనగర్ నుంచి పనామా వరకు వాహనాలు నెమ్మదిగా సాగాయి. ఓటు వేసేందుకు స్వగ్రామాలకు వెళ్తున్న వారితో రద్దీ పెరిగింది. దాదాపుగా గంటపాటు రద్దీ కొనసాగింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.