విధి నిర్వహణలో అమరుడైన చంద్రుగొండ రేంజ్ అటవీ అధికారి(ఎఫ్‌ఆర్వో) చలమల శ్రీనివాసరావు(45) అంత్యక్రియలు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో ఈర్లపూడిలో శ్రీనివాసరావు అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీనివాస రావు అంత్యక్రియల్లో టీఆర్ఎస్ మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తే సర్కార్ చూస్తూ ఊరుకోదని మంత్రులు హెచ్చరించారు.
‘‘వచ్చే డిసెంబరు నాటికి పోడు భూములకు సంబంధించి నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. అర్హులకు ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఎక్కడా ఎలాంటి వ్యతిరేకత లేదు. అక్రమంగా తెలంగాణకు వలసవచ్చిన గుత్తికోయలు ఇలాంటి దారుణానికి పాల్పడటం సరైంది కాదు. గత కొన్నేళ్లుగా ఆయుధాలు ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చట్టపరంగా ప్రస్తుతం ఇది సాధ్యం కాదు. ప్రస్తుత చట్టాల్లో సవరణలు చేసి అటవీ శాఖ అధికారులకు ఆయుధాలు కేటాయించాలని ఎంతో మంది ఫోన్లు చేసి చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రులు హామీ ఇచ్చారు.