టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకే కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. మరోవైపు కమిషన్ కూడా ఈ వ్యవహారంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే 50 మందిని డీబార్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న వారిలో 16 మంది తమపై ఉన్న డీబార్‌ను ఎత్తివేయాలని వివరణ ఇవ్వగా టీఎస్‌పీఎస్సీ తోసిపుచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పరీక్షలకు హాజరుకావద్దని స్పష్టం చేసింది.
ఈ కేసులో మొత్తం 50 మంది నిందితులను డిబార్ చేసిన కమిషన్.. ఏవైనా అభ్యంతరాలుంటే రెండ్రోజుల్లో తెలియజేయాలని ఇటీవల వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అందులో 16 మంది అభ్యర్థులు తమ వివరణ తెలియజేయగా ఇవి సంతృప్తికరంగా లేవని పేర్కొంది. క్రైమ్ నం.64/2023, 95/2023 కేసుల్లో నిందితులుగా ఉన్న మీరు లీకేజీ కేసులో ప్రమేయాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించింది. భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే నియామక, శాఖాపరమైన పరీక్షలు రాయకుండా డీబార్ చేసినట్లు తెలిపింది.