ఆర్టీసీ చరిత్రలోనే అతిపెద్ద సమ్మెకు ఏడాది పూర్తైంది. కానీ వారి సమస్యలకు పరిష్కారం మాత్రం దొరకలేదు. సీఎం కేసీఆర్ స్వయంగా ఆర్టీసీ కార్మికులను ప్రగతిభవన్‌కు పిలిపించి హామీలిచ్చినా.. అమల్లో మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఆర్టీసిలో యూనియన్లు క్రీయాశీలకంగా లేకపోవడంతో కార్మికుల్లో అసంతృప్తి నెలకొంది.
దసరా, దీపావళి, పండుగలు, శుభకార్యాలను కాదని 55 రోజుల సుదీర్ఘ సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికుల్లో నైరాష్యం నెలకొంది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు మరో 20కిపైగా సమస్యలు పరిష్కరించాలంటూ.. గతేడాది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 10వేల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 40 వేలకుపైగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
ఆర్టీసి సమ్మె ఏమాత్రం సమర్థనీయం కాదన్న .. సీఎం కేసీఆర్.. వారి డిమాండ్లకు ఒప్పుకోలేదు. విధుల్లో చేరాలంటూ కార్మికులకు పలుమార్లు డెడ్లైన్లు పెట్టారు. మొదట్లో సీఎం కేసీఆర్ డెడ్లైన్లను పట్టించుకోని కార్మికులు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసినప్పటికీ, తరువాత .. వెనక్కి తగ్గక తప్పలేదు. చివరి అవకాశంగా ఉద్యోగాల్లో చేరిపోవాలని సీఎం సూచించడంతో నవంబర్ 25న కార్మికులంతా విధుల్లో చేరారు. ఈ సమయంలో అన్ని డిపోల నుంచి కొందరిని ప్రగతిభవన్‌కు పిలిపించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. వారితో కలిసి భోజనం కూడా చేశారు.
కార్మికుల పదవి విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచడంతో పాటు ఆర్టీసీలో సస్పెన్షన్లు ఉండవని ప్రకటించారు. సమ్మెలో పాల్గొన్న ఏ ఒక్క కార్మికుడి ఉద్యోగాన్ని తొలగించమని హామీ ఇచ్చారు. కార్మికసంఘాలను రద్దుచేసి వాటి స్థానంలో వెల్ఫేర్ కమిటీలు పని చేస్తాయని స్పష్టం చేశారు. సమ్మె కాలానికి జీతం కూడా చెల్లిస్తామని… ఖాళీలను భర్తీ చేస్తామని హామీఇచ్చారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె జరిగి ఏడాది గడిచినా సీఎం ఇచ్చిన హామీలు ఇంకా కార్యారూపం దాల్చలేదు. ఒకటిరెండు డిమాండ్లను పరిష్కరించిన ప్రభుత్వం… మిగిలిన వాటిని పక్కన పెట్టింది. ముఖ్యంగా ఉద్యోగుల సస్పెన్షన్లు ఆగడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కారణంగా మార్చి 22 నుంచి ఆర్టీసీ కార్యకలాపాలు రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజుల పాటు ఆగిపోయాయి. ఆ తరువాత జిల్లాల్లో సర్వీసులను నడిపిస్తున్నారు. తాజాగా అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను ప్రారంభించారు. రెండు వేల కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసిని గట్టెక్కించే అవకాశాలు ఉన్నా అధికారుల అలసత్వం కారణంగా ఇంకా నష్టాల్లోనే కూరుకుపోతుందని కార్మికులు అంటున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యోగులు కోరుతున్నారు.