మెదక్ జిల్లాలో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు మృతి

సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన మరవకముందే మెదక్ జిల్లాలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చేగుంట మండలం చిన్న శివునూరులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఇద్దరు సజీవదహనమయ్యారు. మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి సహా ఆమె నానమ్మ(60) మృతి చెందారు.

స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు వ్యాపించకుండా వెంటనే ఆర్పారు. లోపలికి వెళ్లి చూసేసరికి పూర్తిగా కాలిపోయిన రెండు మృతదేహాలను గుర్తించారు. స్థానికుల సాయంతో అవి ఆరేళ్ల చిన్నారి, ఆమె నానమ్మ మృతదేహాలని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.