తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ కొనుగోలు కేసులో ఓవైపు సిట్, మరోవైపు ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 19 మందిని అరెస్టు విచారించిన సిట్.. విచారణలో కీలక విషయాలను తెలుసుకుంది. మరోవైపు ఇవాళ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్లు కొనుగోలు చేసిన కేసులో భగవంత్, రవి కుమార్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
భగవంత్ తన తమ్ముడు రవి కుమార్ కోసం డాక్యా నాయక్ నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో భగవంత్ పని చేస్తున్నాడని చెప్పారు. డాక్యా నాయక్ బ్యాంకు ఖాతాలో లావాదేవీల విచారణలో ఈ విషయం బయటపడినట్లు చెప్పారు. డాక్యా నాయక్ వద్ద రూ.2 లక్షలకు భగవంత్ ఏఈ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని సిట్ అధికారులు తెలిపారు.