తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేవంత్ సీఎం కాబోతున్న నేపథ్యంలో ఆయన ఇల్లు, కార్యాలయం, ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో విద్యుత్తు సరఫరా తదితర అంశాలపై విద్యుత్తు శాఖ సమీక్షించింది.
కరెంట్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ ఇంజినీర్లను ఆదేశించింది. రేవంత్ రెడ్డి ఇంటికి జూబ్లీహిల్స్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్తు సరఫరా అవుతుండగా.. ఆ వ్యవస్థలో సమస్య తలెత్తినా సరఫరా ఆగకుండా చూసే క్రమంలో ఇంజినీర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. రోడ్ నంబరు 22లోని సబ్‌స్టేషన్ నుంచీ సరఫరా అయ్యేలా తాజాగా చర్యలు తీసుకున్నారు.
రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించే వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో విద్యుత్తు సరఫరాపైనా కార్పొరేట్ కార్యాలయం సమీక్షించింది. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్ తరహాలో కొడంగల్ నియోజకవర్గంలోనూ సరఫరా మెరుగ్గా ఉండాలని ఉన్నతాధికారులు సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు.