కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో ఎనిమీ ప్రాపర్టీస్ పై కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు
సమాధానాలిచ్చారు. ‘తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై సమీక్ష నిర్వహించాం. రంగారెడ్డి, హైదరాబాద్, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లోని ఎనిమీ ప్రాపర్టీస్ ఉన్నాయి. చాలా ఆస్తులు ఆక్రమణలు జరిగాయి. వాటిని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలి.
నిబంధనలకు అనుగుణంగా పొజిషన్లో ఉన్న సామాన్య ప్రజలు, రైతులకు ఇచ్చేందుకు ఉన్న అవకాశాలేమిటి..? అనే అంశాలపై పూర్తిస్థాయిలో సర్వే, రికార్డ్స్ పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను కోరాము. గతంలో పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా ఇండియా నుండి పాకిస్తాన్ వెళ్లిన ప్రజలు, ఇక్కడ తమ ఆస్తులను వదిలేసి వెళ్లారు. అట్లాగే పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన వాళ్లు అక్కడ తమ ఆస్తులను వదిలేశారు. అయితే ఆ ఆస్తులు పాకిస్తాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి అమ్మేసుకుంది.