మొన్నటిదాకా సాధారణంగా ఉన్న కూరగాయలు అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయాయి. మొన్నటి వరకు 6 కేజీల టమాటాకు వంద రూపాయలు ఉంటే.. ఇప్పుడు రైతు బజారులోనే కిలో టమాట ముప్పై రూపాయలు దాటింది. ఇక బయట మార్కెట్లో ఏకంగా రూ.50 వరకు ధర పలుకుతోంది. ఇక బీన్స్ అయితే ఏకంగా రూ.200 దాటింది. బీర, సొరకాయలు రూ.60కిపైగానే ఉంటున్నాయి.
అకాల వర్షాలు.. రబీ – ఖరీఫ్ అంతరంతో కూరగాయల సాగు తగ్గిపోయిందని రైతులు చెబుతున్నారు. ఇదే అదనుగా ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని తెలిపారు. ముందస్తు ప్రణాళికలు ఉన్నా ఆచరణలో విఫలం కావడంతో ప్రజల నడ్డి విరిచేలా భారం పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు.
హైదరాబాద్ నగరంలో ప్రతి రోజూ 5 వేల క్వింటాళ్ల టమాటా వస్తే ధర కాస్త అందుబాటులో ఉంటోంది. ఇప్పుడు 4 వేల క్వింటాళ్లలోపే రావడంతో ధర పెరిగింది. రైతు బజారు ధర ప్రకారం కిలో టమాటా రూ.31.. గుండు బీన్స్ ధర రూ. 155. గింజ చిక్కుడు రూ.85, పచ్చకాకర రూ.55లు, బెండకాయ రూ.45, పచ్చి మిర్చి రూ. 50 ఉంటే..బహిరంగ మార్కెట్‌లో రూ.10-20 అధికంగా ఉంటోంది.