వాళ్లను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.. ఇజ్రాయెల్‌పై అమెరికా ఫైర్!

-

రఫాలో ఇజ్రాయెల్‌ ఆదివారం రోజున జరిపిన దాడులను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. రఫాపైనే అందరి కళ్లూ ఉన్నాయని ఇజ్రాయెల్ను హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో All Eyes On Rafah అనే పోస్టు ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ తీరును మిత్రదేశమైన అమెరికా ఖండించింది. రఫాపై దాడిలో మహిళలు, పిల్లలు సహా పెద్ద ఎత్తున మరణాలు సంభవించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దాడి దృశ్యాలు కలచివేసేలా ఉన్నాయని, ఆ ప్రాంతాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతోందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

రఫాలో ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో సామాన్య పౌరులు మరణించిన దృశ్యాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయని, అవన్నీ చూస్తుంటే హృదయం తరుక్కుపోతోందని వైట్ హౌజ్ జాతీయ భద్రతా మండలి వ్యూహాత్మక సమాచార విభాగం సమన్వయకర్త జాన్‌ కిర్బీ అన్నారు. హమాస్‌తో జరుగుతున్న ఈ పోరులో సామాన్యులకు ఎలాంటి హాని జరగొద్దని పేర్కొన్నారు. హమాస్‌కు బుద్ధిచెప్పే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందన్న అమెరికా.. అది సామాన్య పౌరులకు ఎలాంటి ముప్పు తలపెట్టొద్దని వ్యాఖ్యానించింది. అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news