ముర్మును “రాష్ట్రపత్ని”అనడం నీచ సంస్కారమే – రాములమ్మ

-

ముర్మును “రాష్ట్రపత్ని”అనడం నీచ సంస్కారమేనని విజయశాంతి ఫైర్‌ అయ్యారు. విలువలు, విజ్ఞత కలిగిన వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్తానంతో భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన విశిష్ట వ్యక్తి, తొలి ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది ముర్ముగారిని చూసి యావత్ దేశం గర్విస్తోంది. అత్యున్నత పదవుల్లో సామాన్యులకు సైతం చోటిచ్చే మన ప్రజాస్వామ్యంలోని ప్రత్యేకతను ప్రపంచమంతా ప్రశంసిస్తుండగా… ఈ విషయంలో బీజేపీ నిర్ణయాన్ని దేశ ప్రజలు స్వాగతిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓర్వలేని తనం బట్టబయలైందని మండిపడ్డారు.

కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధరి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముగారిని ఉద్దేశించి “రాష్ట్రపత్ని” అని అనడం ఆ పెద్దమనిషి నీచ సంస్కారాన్ని, ఆయన్ని కనీసం మందలించలేని ఆ పార్టీ కుసంస్కృతిని వెల్లడిస్తోంది. ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ప్రతిభా పాటిల్ గారు భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వారిని నాటి అధికార, విపక్ష పార్టీల నేతలు, మీడియా, ప్రజలు ఏ విధంగా సంబోధించడం జరిగిందో తెలియదా? ఏదో నోరు జారి అలా అన్నానంటున్న అధీర్ రంజన్ తన తప్పు తెలుసుకుని వెంటనే ఎందుకు క్షమాపణ చెప్పలేదు? అని నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీ సైతం ఆయనతో ఎందుకు వెంటనే ఆ పని చేయించ లేకపోయింది? అధీర్ రంజన్ హోదా కూడా తక్కువేం కాదు… కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హోదాలోనేగాక, కాంగ్రెస్ లోక్​సభాపక్షనేతగా కూడా ఉన్నారు. తను చేసిన తప్పేంటో ఆయనకి బాగా తెలుసు. నిజంగా మహిళల పట్ల ఆయనకి గౌరవమే ఉంటే క్షమాపణ చెప్పడంలో మీనమేషాలు లెక్కించి జాప్యం చెయ్యాల్సిన పనేముంది? బీజేపీ అధికారంలో ఉన్నా, గతంలో విపక్షంలో ఉన్నా పార్టీలకి అతీతంగా మహిళల్ని గౌరవించింది. గతంలో పార్లమెంట్‌పై దాడి జరిగినప్పుడు నాటి ప్రధాని వాజ్‌పేయి గారు ముందుగా అప్పటి ప్రతిపక్ష నాయకురాలైన సోనియా గాంధీ గారి భద్రత, క్షేమం పైనే దృష్టిపెట్టి తగిన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ప్రజలంతా అసహ్యించుకునేలా ఉందని ఫైర్ అయ్యారు విజయశాంతి.

 

Read more RELATED
Recommended to you

Latest news