కేసీఆర్‌కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చించారు విజయశాంతి. కేసీఆర్ ఎప్పుడూ చెప్పే మాట… తమది రైతు ప్రభుత్వమని. కానీ అది చేతల్లో కనిపించడం లేదు. రైతులు యాసంగి ధాన్యం అమ్మి వారాలు గడుస్తున్నా… అమ్మిన వడ్లకు ఇంకా పైసలు రాలేదని తెలిపాత్రు. మరోవైపు వానాకాలం సీజన్ వచ్చింది. పంటల పెట్టుబడులకు యాడా పైసలు దొరక అన్నదాతలు ఆందోళన చెందుతున్నరు. కామారెడ్డి జిల్లాలో యాసంగి సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 3.4 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండాయన్నారు.
కానీ కేసీఆర్ సర్కార్ 55,869 మంది రైతుల నుంచి కేవలం 2.70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే కొనుగోలు చేసింది. మిగతా ధాన్యాన్ని రైతులు దళారులకు అమ్ముకున్నరు. ప్రభుత్వం కొన్న ధాన్యానికి గాను రైతులకు రూ.530 కోట్లు చెల్లించాలి. అయితే ఇందులో ఇంకా 10,500 రైతులకు రూ.104 కోట్ల మేర సొమ్ము గవర్నమెంట్ బాకీ ఉంది. వడ్లు కాంటా పెట్టిన 48 గంటల్లోగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు పలుమార్లు కేసీఆర్ భజన బ్యాచ్ చెప్పినప్పటికీ… క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు.
ఇది ఒక్క కామారెడ్డి జిల్లాలోనే కాదు. తెలంగాణ మొత్తం ఇదే పరిస్థితి ఉంది. యాసంగి సీజన్‌లో వడ్ల కొనుగోళ్లు షురూ చేసినప్పటి నుంచీ పైసల చెల్లింపుల్లో ప్రభుత్వం ఆలస్యం చేస్తునే వచ్చింది. సెంటర్లలో వడ్లను కాంటా పెట్టడం, ఆన్లైన్లో ఎంట్రీ, రైస్ మిల్లుల నుంచి తక్ పట్టీలు రావడం… ఇలా ప్రతి దానిలోనూ ఆలస్యం జరిగింది. ఈ పక్రియ కంప్లీట్ అయిన తర్వాత కూడా రైతుల అకౌంట్లలో పైసలు జమ కావడం లేదు. ప్రస్తుత వానకాలం సీజన్‌లో పంటల సాగుకు పెట్టుబడుల కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నరు. ఒక్కవైపు రైతన్నలకు అప్పుల బాధలు ఎక్కువై… ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉంటే, వారిని కేసీఆర్ సర్కార్ కనీసం పట్టించుకోవడం లేదు. అన్నదాతల జీవితాలతో ఆడుకుంటున్న కేసీఆర్‌కు తెలంగాణ రైతాంగం కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చరించారు విజయశాంతి.