బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు.. ఆయన సినిమాలు ఆపాలంటూ!

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ పై  విజయశాంతి సంచలన వ్యాఖ్యలు.. చేశారు. ప్రజల్ని అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడితే… ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ గారికి జనం అర్థమయ్యేలా చేస్తున్నరు. బీజేపీ సర్కారుపై గుడ్డి వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ 2015లో ఆమీర్ చేసిన అసహన వ్యాఖ్యల ఫలితాన్ని ఇప్పుడాయన చూస్తున్నారని గుర్తు చేశారు. భారత్‌లో అసహనం పెరిగిపోయిందని… ఈ దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించిందని అప్పట్లో జరిగిన జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో ఆమీర్ అన్నారన్నారు.


భారతదేశంలోని ప్రభుత్వ, ప్రయివేట్ వ్యవస్థల్లో హైందవేతరులు ఎన్నెన్ని గొప్ప గొప్ప స్థానాల్ని పొందారో… ఇప్పటికీ పొందుతున్నారో… చరిత్రను, సమకాలీన పరిస్థితుల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. మనకి స్వాతంత్ర్యం రావడానికి ముందు, తర్వాత, నేడు… ఎప్పుడు చూసుకున్నా ఈ దేశం మతసామరస్యంతో అందరికీ స్థానమిచ్చి గౌరవిస్తోంది. ఇందుకు పెద్ద ఉదాహరణ ఆమీర్‌తో సహా బాలీవుడ్‌లో సముచిత గౌరవం అందుకుంటున్న ఖాన్ త్రయాన్నే చెప్పుకోవచ్చు. కానీ, వాస్తవమేంటో తెలిసిన ప్రజలు ఆమీర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టడంతో పాటు, ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న వాణిజ్య ఉత్పత్తుల్ని కూడా బహిష్కరించారని పేర్కొన్నారు రాములమ్మ.

గతంలో ఆమీర్ నటించిన పీకే సినిమాలో సైతం హిందూ వ్యతిరేకతనే ప్రధానంగా చూపించడమేగాక, హిందూ దేవుళ్లని అవమానించారు. అప్పట్లో హిందూ సంస్థలు ఆ సినిమాని నిషేధించాలని కూడా డిమాండ్ చేశాయి. ఇలా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ అనే ఇన్స్‌పిరేషనల్ మూవీతో ముందుకొచ్చారు. కానీ, ప్రజల్లో ఏమాత్రం స్ఫూర్తిని నింపే స్థితిలో లేని ఆమీర్… గతంలో చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యల్ని ప్రజలు ఆయనకి గుర్తు చేస్తూ Boycott Laal Singh Chaddha హ్యాష్ ట్యాగ్‌తో ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అందర్నీ మేలుకొలుపుతున్నరు. దురదృష్టమేంటంటే…. జనం ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా మన సౌత్ హీరోలు కొందరు ఆ ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్టు , ఆమీర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ టీవీషోల్లో పాల్గొంటున్నరు. దేశం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సమంజసం కాదేమో వారు ఆలోచించాలని చురకలు అంటించారు విజయశాంతి.