పార్టీ మార్పుపై విజయశాంతి సంచలన ట్వీట్ చేశారు. నాపై, బీజేపీపై కేసిఆర్ గారు చేయిస్తున్న ప్రచారం ఎందుకో, చేస్తున్నవారికే తెలియాలని చురకలు అంటించారు. ఒకనాడు టైగర్ నరేంద్రగారు, నేను తెలంగాణపై నాటి కూటమి NDA భాగస్వామ్యపక్షాల నియంత్రణ వలన సొంత పార్టీలు నడుపుకోవాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ సాధన అన్న ఒక్క ఉద్దేశ్యం కోసం మా ఇద్దరి పార్టీలు టీఆర్ఎస్‌లో విలీనం చేశామని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ స్వకుటుంబ ప్రయోజనాలకై మా ఇద్దరి సస్పెన్షన్ చేపట్టారన్నది ప్రజా సమాజానికి మొత్తం తెలుసని.. టీఆర్ఎస్ నుండి ఈటల గారి సస్పెన్షన్ కూడా ఆ దారిలోనిదే అని మండిపడ్డారు. ఒక సమయంలో నేను, నరేంద్ర గారు సిద్దాంత కార్యచరణకు కొంత సానుకూలత లేకున్నా… ఎందుకు కాంగ్రెస్‌లో పని చేయవలసివచ్చిందో అందరికి, ప్రత్యేకించి బీజేపీ శ్రేణులకు స్పష్టంగా తెలుసన్నారు.
ఇయ్యాల, విజయశాంతికి బీజేపీ ఇంపార్టెన్స్ ఇయ్యలేదనే అవాస్తవం మీ ఛానల్ చెప్పదలుచుకుంటే అది మీ అభిప్రాయం… మీ పోస్టింగ్ మీ ఇష్టం… ఐతే, తెలంగాణ రాష్ట్రం, దేశం, ధర్మం మాకు ఎప్పటికీ విడదీయలేని భావోద్వేగభరిత సమాహారమని తెలిపారు. అర్దం చేసుకున్న మా కార్యకర్తలకు, ఉద్యమకారులకు ఇది తెలుసు, అర్థం కాని వాళ్ళకు చెప్పే అవసరం లేదని కూడా నా పోరాట పంథా తెలిసిన వారికి తెలుసని వెల్లడించారు విజయశాంతి.