బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చే ఆలోచనలో ఉన్నాం : ఎర్రబెల్లి

-

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల కోసం బీఆర్ఎస్ పోరుబాటపట్టింది. అధినేత కేసీఆర్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు రైతు దీక్షలు చేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో చేపట్టిన దీక్షలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. BRS పేరు మార్చే ఆలోచన చేస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ TRS గా మార్చేందుకు కసరత్తు ప్రాభించినట్లు తెలిపారు.

టీఆర్ఎస్ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత పార్టీకి పెద్దగా కలిసి రావడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ పేరు మార్పుపై ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమైందని అన్నారు. బీఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని స్వయంగా క్షేత్రస్థాయి లీడర్లు అధిష్టానం వద్ద మొరపెట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు. టీఆర్ఎస్ పేరుతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ.. పేరు మార్చగానే అధికారం కోల్పోయిందని అన్నారు. అనంతరం తాను పార్టీ మారబోతున్నట్లు వస్తోన్న వార్తలపై స్పందించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారను అని ప్రకటించారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news