తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరగానే అన్నీ శాఖలను ప్రక్షాళన చేయనున్నట్టు అటు సీఎం, ఇటు మంత్రులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రగతిభవన్ పేరును ప్రజా భవన్ గా మార్చారు. ప్రజాభవన్ లో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావాణిలో భాగంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మండల, గ్రామ, డివిజన్, జిల్లా కార్యాలయాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఫిర్యాదులు స్వీకరించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదిలా ఉంటే.. తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల పౌరసరఫరాల శాఖ రూ.56వేల కోట్ల అప్పుల్లో ఉందని వెల్లడించారు. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ రూ.11వేల కోట్ల అప్పుల్లో నడుస్తోందని చెప్పారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అసెంబ్లీలో వాడివేడీగా చర్చలు జరుగుతున్నాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓ వైపు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా.. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు రాజనరసింహ ధీటుగా తిప్పికొడుతున్నారు.