త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి ఆగదని ప్రగతి పథంలో ఇంకా ముందుకు సాగుదాం అని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా అంతాయిపల్లి తూముకుంట లోని కన్వెన్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 95 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు టిఆర్ఎస్ గెలవనుందని పార్టీ శ్రేణులకు చెప్పారు.
రాష్ట్రానికే తలమానికంగా గజ్వేల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో ఒక్క నిరుపేద కూడా ఇల్లు లేకుండా ఉండకూడదనే తన లక్ష్యమని స్పష్టం చేశారు మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రతినెలా ఒక రోజు కేటాయించి గజ్వేల్ నియోజకవర్గం సమావేశం ఏర్పాటు చేసి మీ మధ్యనే గడుపుతానని అభివృద్ధిని సమీక్షిస్తానని ప్రకటించారు. కొండపోచమ్మ సాగరు మల్లన్న సాగరు ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తాను గెలిచిన తర్వాత మళ్ళీ సీఎం హోదాలో తొలి సమావేశం ఈ హాల్లోనే ఏర్పాటు చేసి పెండింగ్ ప్రాజెక్టులు ఇతర పనులకు సంబంధించి విస్తృతంగా చర్చించి బ్లూ ప్రింట్ తయారు చేద్దామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి తో సంతృప్తి పడుద్దనే చేయాల్సింది ఇంకా చాలా ఉంది అన్నారు సీఎం కేసీఆర్.