రాముల‌మ్మ మ‌న‌సులో ఏముంది?

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాముల‌మ్మ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయిన‌ర్‌. అది పేరుకే.. పేరొక‌రిది ఊరొక‌రిది అన్న‌ట్టుగా పేరుకే రాముల‌మ్మ విజ‌య‌శాంతిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారానికి స్టార్ క్యాంపెయిన‌ర్‌గా నియ‌మించారు. అంత‌కు మించి విజ‌య‌శాంతికి పార్టీ నుంచి ఒరిగింది ఏమీ లేదు. దీంతో గ‌త కొంత కాలంగా పార్టీ కార్య‌క‌లాపాల‌కు, గాంధీ భ‌వ‌న్‌కు రాముల‌మ్మ దూరంగా వుంటూ వ‌స్తోంది.

పార్టీలో త‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం, టీడీపీ నుంచి వ‌చ్చిన రేవంత్‌రెడ్డి లాంటి వాళ్ల‌కి ప్రాధాన్య‌త‌నిస్తుండ‌టంతో గ‌త కొన్ని నెల‌లు గా రాముల‌మ్మ మ‌న‌స్థాపానికి గుర‌వుతోంద‌ట‌. ఆ కార‌ణంగానే ఆమె పార్టీకి దూరంగా వుంటూ వ‌స్తోంద‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. దీంతో పార్టీ కీల‌క స‌మావేశాల‌కు ఆమె డుమ్మా కొడుతున్నార‌ట‌. దుబ్బాక ఉప ఎన్నిక ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారిన నేప‌థ్యంలో దీనిపై జ‌రిగిన చ‌ర్చ‌కు రాముల‌మ్మ గైర్హాజ‌రు కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

దుబ్బాక ఉప ఎన్నిక‌లో రాముల‌మ్మ‌ని నిల‌బెట్టాల‌ని ఊహాగానాలు వినిపిస్తుంటే రాముల‌మ్మ మాత్రం పార్టీ స‌మావేల‌కు డుమ్మా కొట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ రాముల‌మ్మ మ‌న‌సులో ఏముంది? ఎందుకు మౌనంగా వుంటోంది? అన్న‌ది పార్టీ వ‌ర్గాల‌కు అంతుచిక్క‌డం లేద‌ట. కొంత మంది మాత్రం దుబ్బాక‌లో ఎవ‌రిని నిల‌బెట్టినా గెలుపు అధికార పార్టీదే అని రాముల‌మ్మ బ‌లంగా న‌మ్ముతోంద‌ని ఆకార‌ణంగానే ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డానికి ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని కాంగ్రెస్ లో ఓ వ‌ర్గం చెబుతోంది.