కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించడం.. లేదా కదులుతున్న రైలు నుంచి దిగడానికి ప్రయత్నించడం.. రైలు వచ్చినప్పుడు ప్లాట్‌ఫామ్ మీద కాకుండా.. ట్రాక్‌కు దగ్గరగా ఉండటం.. ఇలా రకరకాలుగా ప్రమాదాల బారిన పడుతున్నారు ప్రయాణికులు. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు.. ఇది గమనించి వారిని ప్రాణాపాయం నుంచి కాపాడుతున్నారు. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా వరకు కేసుల్లో క్షణాల వ్యవధిలో.. పోలీసుల సమయస్ఫూర్తితో ప్రయాణికుల ప్రాణాలు దక్కుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే వరంగల్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది.
వరంగల్ రైల్వేస్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించిన ఓ మహిళ ప్రమాదవశాత్తు రైలు కింద పడుతుండగా… ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ చాకచక్యంగా కాపాడారు. భద్రాచలం రోడ్డు నుంచి సికింద్రాబాద్ వెళ్లే మణుగూరు ఎక్స్‌ప్రెస్ శనివారం తెల్లవారుజామున 2 గంటల 47 నిమిషాలకు వరంగల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆగుతున్న సమయంలో ఓ మహిళా ప్రయాణికురాలు దిగేందుకు ప్రయత్నించారు. పట్టు జారి ప్లాట్‌ఫాం మీద పడిపోయారు. తలుపు వద్ద హ్యాండిల్‌ను వదలక పోవటంతో… కొద్ది దూరం రైలు ఆమెను ఈడ్చుకొని వెళ్లింది. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న రైల్వే రక్షక దళం మహిళా కానిస్టేబుల్ సొనాలి పరుగున వచ్చి ప్రయాణికురాలిని ఒక్క ఉదుటున ప్లాట్‌ఫాం వైపు లాగారు. దీంతో ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది.