యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం రాత్రి 8.45. గంటలకు ప్రారంభమైన కల్యాణ మహోత్సవం.. సుమారు రెండున్నర గంటల పాటు నిర్వహించారు. ఈ ఉత్సవంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బిర్లా అయిలయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున మంత్రులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణాన్ని చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కల్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఎల్ ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు వివిధ రకాల పూలు, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.
ఆలయ పునర్ నిర్మాణం తరువాత రెండో సారి ఈ వేడుకలు జరగడంతో అధికారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. స్వామి వారి కల్యాణం కొండపై ఆలయ సన్నిధిలో నిర్వహించడంతో భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ మాడవీధులు భక్తులతో నిండిపోయాయి. రద్దీ దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.