వరుసగా ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమర్ పుతిన్ ఎన్నికయ్యారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌కు 87.29 శాతం ఓట్లు వచ్చాయి. పుతిన్ ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు రష్యా ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పుతిన్కు అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల విజయంతో మరో ఆరేళ్లు పుతిన్ పదవిలో ఉండనున్నారు. అలా జరిగితే సోవియట్ యూనియన్‌ను 29 ఏళ్లపాటు (1924 నుంచి 1953) పాలించిన జోసెఫ్ స్టాలిన్ రికార్డును పుతిన్ బ్రేక్ చేసినట్లవుతుంది.
ఐదోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తరుణంలో మాట్లాడుతూ.. రష్యాకు, అమెరికా నేతృత్వంలోని నాటో కూటమికి మధ్య ఘర్షణ తలెత్తితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని పుతిన్ అన్నారు. దీన్ని ఎవరూ కోరుకోవడం లేదని, నాటో దళాలు ఇప్పటికే ఉక్రెయిన్‌లో ఉన్నాయని, ఇది ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు. భవిష్యత్తులో తమ సైన్యాన్ని ఉక్రెయిన్‌కు పంపే ఆలోచనను కొట్టిపారేయలేమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ చేసిన వ్యాఖ్యలపైనా పుతిన్ స్పందిస్తూ.. ఇది రష్యా, నాటో మధ్య ప్రత్యక్ష పోరుకు దారితీయొచ్చని తెలిపారు.