యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ స్వామి, అమ్మవార్ల కల్యాణం జరగనుంది. ఈ వేడుకకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు రాత్రి 8:45 గంటలకు శ్రీస్వామి, అమ్మవార్ల తిరుకల్యాణ మహాపర్వం గజవాహనంపై సేవోత్సవంతో మొదలవుతుందని పూజారులు తెలిపారు.
మరోవైపు స్వామివారి కల్యాణ పర్వానికి ముందుగా ఆదివారం రాత్రి ఆచార, వ్యవహారాలతో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. అశ్వవాహనంపై నారసింహుడు, ముత్యాల పల్లకిపై అమ్మ లక్ష్మీదేవిని ముస్తాబు చేసి మంగళ వాద్యాలతో ఉత్సవాన్ని జరిపారు. తొలుత పెళ్లి చూపుల పర్వాన్ని నిర్వహించిన అర్చకులు అనంతరం అలంకార సేవలను ఎదురెదురుగా అధిష్ఠింపజేసి మాటామంతీ చేపట్టారు. పెళ్లి సంబంధాన్ని ఖాయం చేసుకుని వరపూజ, పూలుపండ్లు పర్వాన్ని శాస్త్రోక్తంగా కొనసాగించి లగ్న పత్రిక రాసుకుని కల్యాణ శుభ ఘడియలతో ముహూర్తాన్ని నిర్ణయించి లోకానికి చాటారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు వరపూజ, పూలుపండ్లు సమర్పణ ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే వైనాన్ని నిర్వహిస్తూ ఎదుర్కోలు ఉత్సవానికి తెరదించారు. ఇక ఈరోజు రాత్రి స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణం జరగనుంది.