తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీపంచనారసింహుల వార్షిక బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు యాదాద్రిలో ఈ వేడుకలు జరగనున్నాయి. నిశ్చయించిన ముహూర్తాన ఉత్సవాల నిర్వహణకు ఆచార్య బృందాలు సంప్రదాయంగా సంసిద్ధులయ్యారు. తిరుమంజనంతో గర్భగుడి శుద్ధి చేసిన అర్చకులు ఆళ్వారుల ఎదుట మహాముఖ మండపంలో విష్వక్సేన ఆళ్వారుడుకి తొలి పూజ చేశారు.పదకొండు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు రూ.1.60 కోట్లు కేటాయించామని ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు. ఈ బడ్జెట్‌లో రూ.60 లక్షలు విద్యుత్తు అలంకరణకు ఖర్చు చేస్తామని వెల్లడించారు.
ఉత్సవాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం ప్రప్రథమంగా విష్వక్సేన ఆరాధన, స్వస్తివచనం, సాయంత్రం మృత్స్యంగ్రహణం, అంకురార్పణ పర్వాలు చేపడతారు. మంగళవారం ఉదయం అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, సాయంత్రం భేరీపూజ, హవనం, దేవతలకు ఆహ్వానం క్రతువులు నిర్వహిస్తారు. యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాద్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి యాదగిరిగుట్టకు రావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.