తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా పై మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ డీకే అరుణతో కలిసి బోడుప్పల్ వక్ఫ్ స్థలాలను పరిశీలించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా దెబ్బకు బ్యాంకులు ఎవ్వరికీ రుణాలు ఇవ్వడం లేదన్నారు. దీంతో వేల కుటుంబాలు సమస్యలతో కూరుకుపోయాయన్నారు. తాను రాజకీయాలు మాట్లాడటం లేదు. ప్రజల ఆక్రోశం, బాధల గురించి మాట్లాడుతున్నాను. హైడ్రా వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఏమవుతుందేమోనని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో ఉన్న భూముల సమస్య పై వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్. హైదరాబాద్ గ్లోబల్ సిటీ, దాని బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యాపారం, రిజిస్ట్రేషన్లు అన్నీ పడిపోయాయని గుర్తుకు చేశారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా దూసుకెళ్తోంది హైడ్రా. ఇప్పటివరకు దాదాపు 120 ఎకరాల వరకు భూమిని స్వాధీనం చేసుకుంది.