బడ్జెట్ లో సున్నా.. వరద సహాయంలో సున్నా అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించి వరద బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సాగర్ కేనాల్ కొట్టుకుపోవడం వల్ల వేల ఎకరాల పంటలకు నష్టం జరిగింది. గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసిన రూ.30వేలు నష్టపరిహారం అందించాలన్నారు. కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తే.. ప్రధాని మోడీని నిలదీద్దామన్నారు హరీశ్ రావు. పాలన చేతకాక ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. బీఆర్ఎస్ తరపున తాము సాయం చేయడానికి వచ్చామని తెలిపారు. బాధితులు తమ సమస్యలను మాతో చెప్పుకున్నారు. ఏ ఇంటికి వెళ్లినా నష్టమే కనిపిస్తోంది. వరదలు చుట్టుముట్టితే.. కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. వరద బాధితులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు. ఇప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్దరించలేదన్నారు.