ఉద్యోగాల కోసం అహర్నిశలు శ్రమిస్తూ తమను ఇంత వరకు చదివించిన తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలనుకునే యువకుల ఆశయాలను ఆసరాగా తీసుకుంటున ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు గుంజేస్తున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మోద్దో తెలియని పరిస్థితులు నేటి సమాజంలో నెలకొన్నాయి. దేశం కాని దేశంలో.. అమాయక విద్యార్థులను ఉద్యోగాల పేరిట మోసం చేశారు ఓ క్రిమినల్ జంట. ఏ పొరుగు రాష్ట్రం వారో పొరుగు దేశం వారో కాదు.. మన తెలుగు వారే..
ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసాల పేరిట విదేశాలకు పంపిస్తామని ఎవరైనా చెప్పి అందుకు గాను డబ్బులు అడిగితే ఎవరూ నమ్మకూడదని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కొందరు ఇంకా అలాంటి బాధితుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ఇక తాజాగా ఓ తెలుగు జంట అమెరికా వీసాలు ఇప్పిస్తామని నమ్మబలికి తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థుల నుంచి రూ.10 కోట్ల వరకు వసూలు చేసి ఉడాయించారు. ఈ భారీ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ముత్యాల సునీల్, అతని భార్య ప్రణీతలు అమెరికాలో ఉంటున్నారు. కాగా వీరు అమెరికాకు పంపిస్తామని, ఉద్యోగాల కోసం హెచ్1బీ వీసాలు, విద్యార్థులకు ఎఫ్1 వీసాలు వచ్చేలా చూస్తామని నమ్మబలికారు. దీంతో విద్యార్థులు సరే అని నమ్మి వారికి భారీగా డబ్బులు ముట్టజెప్పారు. ఈ క్రమంలో ఒక్కో విద్యార్థి నుంచి వారు 25వేల డాలర్ల వరకు (దాదాపుగా రూ.18 లక్షలు) వసూలు చేశారు. ఈ క్రమంలో మొత్తం 30 మంది నుంచి దాదాపుగా రూ.10 కోట్ల వరకు వసూలు చేశారు. అనంతరం పరారయ్యారు.
కాగా సదరు జంట మోసంపై అమెరికాలో అక్కడి అట్లాంటా హోం ల్యాండ్ సెక్యూరిటీ పోలీసులకు విద్యార్థులు ఫిర్యాదు చేయగా.. వారు ఆ జంటపై కేసు నమోదు చేశారు. ఇక ఇదే విషయమై ఆ జంట కోసం ఇంటర్ పోల్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. అయితే వారు యూరప్‌కు పారిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇంటర్‌పోల్ వారి కోసం గాలిస్తోంది. అయితే విద్యార్థుల నుంచి సేకరించిన మొత్తాన్ని సునీల్ తన తండ్రి ముత్యాల సత్యనారాయణ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఈ క్రమంలో సత్యనారాయణ బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం సత్యనారాయణ కూడా పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.