తెలుగు భాష గొప్పదనాన్ని, అమ్మ భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను భావి తరాలకు తెలియజేసేందుకు నిర్వహించే తెలుగు భాషా అమృతోత్సవాలకు రంగం సిద్ధమైంది. తెలుగు భాషా సాహితీ, సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 29 వరకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ‘తెలుగు భాషా అమృతోత్సవాలు’ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కడవటికంటి విజయ శామ్యూల్ తెలిపారు. ఇందులో భాగంగానే టంగుటూరి ప్రకాశం పంతులు జయంత్యుత్సవాలు ఉంటాయని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్, సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, నందిని సిధారెడ్డిలతో పాటు 50 మంది సాహితీప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. ఆగస్టు 29న గిడుగు రామమూర్తి పంతుల జయంత్యుత్సవాలు జరుగుతాయని, ఆయా కార్యక్రమాలకు సుద్దాల అశోక్‌తేజ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తదితరులు హాజరవుతారని తెలిపారు.