బుల్లితెర ప్రేక్షకులకు పెద్ద షాక్ తగిలేట్టు కనిపిస్తోంది. ఇకపై అభిమాను సీరియల్స్ కార్తీకదీపం, మౌనరాగం, జబర్దస్త్ కామెడీ షోలు కొన్ని రోజులు కనిపించకపోవచ్చు. కరోనా వైరస్ విజృభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ మొత్తం మూగబోయింది. మార్చి 31వరకు షూటింగ్స్, మిగతా అన్ని కార్యకలపాలను మూసి వేశారు. ఈ మేరకు మా కార్యవర్గం, ప్రొడ్యూసర్స్ గిల్డ్, 24 క్రాఫ్ట్స్ విభాగం అన్నీ కలిసి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు అన్ని సంస్థలను మార్చి 31వరకు మూసి వేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు థియేటర్స్, మాల్స్, విద్యా సంస్థలు, క్లబ్స్, పబ్స్ అన్నింటిని బంద్ చేశారు. ఇప్పటికే అన్ని రంగాల కార్మికుల, రోజువారి కూలీలు ఇబ్బంది పడుతున్నారు. అందరూ స్వీయ నిర్భందంలోనే ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బుల్లితెరకు సంబంధించిన యూనియన్స్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి అన్ని రకాలు సీరియల్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ షూటింగ్స్‌ను ఆపివేస్తున్నామని ప్రకటించింది. కరోనా ప్రభావం తగ్గిన తరువాత మళ్లీ యథావిథిగా కొనసాగుతుందని తెలిపారు. రోజూవారి కూలీల మీద ఆధారపడే వారి కోసం ప్రత్యామ్నాయం ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు.