పే టూ స్టే కేసులో తెలుగు విద్యార్థులకు ఊరట కలిగింది. ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ కేసులో అరెస్టయిన 16 మంది విద్యార్థులకు కోర్టులో ఊరట లభించింది. వాళ్లు తమ స్వదేశాలకు ఫిబ్రవరి 20 లోగా వెళ్లాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అరెస్టయిన 20 మందిలో ముగ్గురు విద్యార్థులు వాలంటరీ డిపార్చర్ అనుమతి పొందారు. వాళ్లలో ఇద్దరు ఇండియన్స్, ఒకరు పాలస్తీనియన్ ఉన్నారు. వాళ్లలో 17 మందిపై జరిగిన విచారణలో 15 మందికి వాలంటరీగా తమ దేశాలకు వెళ్లే అవకాశాన్ని కోర్టు కల్పించింది. అందులో 8 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. తర్వాత 16 వ విద్యార్థినికి కూడా తమ దేశం వెళ్లేందుకు అవకాశం కల్పించింది. కాకపోతే 16 వ విద్యార్థినిని యూఎస్ ప్రభుత్వం రిమూవల్ కింద పంపుతున్నట్టు వెల్లడించింది.
దీంతో తెలుగు విద్యార్థులు భారత్ తిరిగి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. వారి ప్రయాణ ఏర్పాట్లు చూసుకోవాలని ఇండియన్ ఎంబసీని తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ కోరింది. ఆటా తెలంగాణ కోరిక మేరకు వాళ్లను స్వదేశానికి పంపించేందుకు ఎంబసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.