టీవీ షూటింగ్‌లకు అనుమతి దొరికేనా..?

-

లాక్ డౌన్ విధించడంతో సినిమా, టీవీ షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో టీవీ చానళ్ల పరిస్థితి మరి దారుణంగా మారింది. సిరీయల్‌లు, టీవీ షోల షూటింగ్‌లు నిలిచిపోవడంతో.. పాత కార్యక్రమాలను మళ్లీ ప్రసారం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్ల ప్రతినిధులు సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి.. షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరారు.

లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారని వారికి వినోదం అందించేందుకు షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని విన్నవించారు. మంత్రిని కలిసినవారిలో ఈటీవీ సీఈవో బాపినీడు, జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ, స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్, జెమిని టీవీ బిజినెస్ హెడ్ కే సుబ్రహ్మణ్యం, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్ లు ఉన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పలు జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్‌లు నిర్వహిస్తామని తెలిపారు. అతి తక్కువ సిబ్బందిని వినియోగిస్తామని చెప్పారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి తలసాని.. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం పలు రంగాలకు సడలింపులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకు ఎలాంటి సడలింపులు ఉండవని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.  అలాగే కరోనా కట్టడి విషయంలో కేసీఆర్ ముందు నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీవీ షూటింగ్‌లకు అనుమతి లభిస్తుందో లేదో వేచిచూడాలి. మరోవైపు ముఖ్యంగా మే 5 కేబినెట్ భేటీ తర్వాత ఎలాంటి విధానాలు ప్రకటించనున్నారనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news