తెలుగోళ్లు డ్రగ్స్ ఎక్కడ కొంటున్నారో తెలుసా..?

-

గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందా గుట్టును హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ బట్టబయలు చేసింది. ఈ క్రమంలోనే డార్క్‌నెట్‌లో సాగుతున్న లావాదేవీలు, డ్రగ్స్ సరఫరా వివరాలపై పోలీసులు రెండు నెలలుగా కన్నేశారు. డెకాయ్ ఆపరేషన్‌తో డ్రగ్స్ దందాలో కీలక సూత్రధారులను గుర్తించి వారిని గోవాలో పట్టుకున్నారు. ఈ ఏడాది అరెస్టయిన వారిలో అధికంగా 11మంది విదేశీయులు ఉండటం విశేషం.

రష్యా, అమెరికా, హాలెండ్‌ తదితర దేశాల నుంచి సముద్రమార్గంలో గోవా చేరిన మత్తుపదార్థాలు డీలర్లకు చేరతాయి. వారు ప్రధాన విక్రయదారులకు విక్రయిస్తారు. గోవాలోని అంజునా బీచ్‌లోనే చాలావరకు డ్రగ్స్ విక్రయాలు జరిగినట్లు పోలీసులు విచారణలో తేలింది. తెలుగు రాష్ట్రాల నుంచి యువకులు డ్రగ్స్‌ కోసం గోవాకు వెళ్లి అక్కడి ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

డ్రగ్స్ కేసులో అరెస్టయిన ప్రితీష్‌ బోర్కర్‌, మంజూర్‌ అహ్మద్‌ నుంచి సేకరించిన వివరాల్లో పలు ఆసక్తికర అంశాలు బయటకొచ్చాయి. వికాస్‌ నాయక్‌ అలియాస్‌ విక్కీ, రమేష్‌ చౌహాన్‌, స్టీవ్‌, ఎడ్విన్‌, సంజ గోవెకర్‌, తుకారాం సల్గాంకర్‌ అలియాస్‌ నాన మత్తుపదార్థాల వ్యాపారంలో కీలక సూత్రధారులు. వీరి కనుసన్నల్లోనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి మత్తుపదార్థాల కోసం గోవాకు వెళ్లే ఏజెంట్లు, కొనుగోలుదారులకు వీరు పరిచయస్తులు. వీరి ద్వారానే కొకైన్‌, హెరాయిన్‌, ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ వంటి మత్తుపదార్థాలను కొనుగోలు చేస్తారని నగర పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

ఈ ఆరుగురు సుమారు 8 ఏళ్లుగా మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు సాగిస్తున్నట్టు భావిస్తున్నారు. డ్రగ్స్‌కు అలవాటుపడి కొనేందుకు డబ్బుల్లేని యువకులు సంపాదన కోసం విక్రయదారులుగా మారుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news