తెలంగాణలో ప్రతిపార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తెరమీదికి వచ్చాయి. త్వరలోనే దీనికి ముహూర్తం ఖరారు కానుంది. అయితే, గతానికి ఇప్పటికి ఈ ఎన్నికలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. నిజానికి ఎప్పటికప్పుడు ఎన్నికలంటేనే రాజకీయ పార్టీల మధ్య వేడి రగిలిస్తూనే ఉంటాయి. కానీ, అంతో ఇంతో తెలంగాణ సెంటిమెంటును రగల్చగలిగే సత్తా ఉన్న కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి ఎన్నికలు వచ్చినా.. తన వ్యూహంతో పరిస్థితిని ఏకపక్షం చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లోనూ కేసీఆర్ ఏదైనా వ్యూహం వేశారా? గ్రేటర్‌లోని మొత్తం 104 సీట్లను గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారా? అంటే.. సహజంగానే కేసీఆర్ వంటి బలమైన సెంటిమెంటు ఉన్న నాయకుడు ఇలా వ్యూహాత్మకంగా అడుగులు వేయొచ్చు. కానీ, ఇప్పుడు ఆయనకు పరిస్థితులు అంత సానుకూలంగా లేవని అంటున్నారు పరిశీలకులు. దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఇవి రాజకీయాలకు కూడా అతీతమని అంటున్నారు.
చిన్ని చినుకు పడితే.. హైదరాబాద్ నగరం చెరువును తలపిస్తుండడం ప్రధాన కారణం. రెండు.. ఇటీవల జీహెచ్ ఎంసీ నిర్వాకంతో ఓ యువకుడు, ఓ చిన్నారి కూడా నాలాలో పడి కొట్టుకుపోయారు. దీనికి ప్రభుత్వం ఆశించిన విధంగా స్పందించలేదు. దీంతో ప్రజలు ఇప్పుడు ఇలాంటి సర్కారు మాకు అవసరమా? అని లెక్కలు వేసుకుంటున్నారు. అదే సమయంలో కరోనా సమయంలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన లభించలేదు. హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నా.. ప్రభుత్వం తరఫున చేతలు శూన్యమయ్యాయి.
అదే సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడికి ప్రభుత్వం అడ్డుకట్టవేయలేక పోయింది. మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు కూడా ప్రజల్లో ఆవేదన మిగిల్చాయి. ఇలా కీలకంగా ఉన్న ఈ మూడు విషయాలే కేసీఆర్‌కు ఇబ్బందిగా మారాయని అంటున్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను నెత్తిన పెట్టుకున్న గ్రేటర్ ఓటర్లు ( ఇందులో బాబుకు యాంటీగా కేసీఆర్ చేసిన ప్రచారంతో పాటు వైసీపీ శ్రేణుల సపోర్ట్ కూడా కేసీఆర్‌కు కలిసొచ్చింది) తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్, మల్కాజ్‌గిరిలో టీఆర్ఎస్ ఎంపీ క్యాండెట్లను ఓడించి వాతలు పెట్టారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సారి గ్రేటర్లో కారు జోరుకు బీజేపీ, కాంగ్రెస్ ఖచ్చితంగా బ్రేక్ వేసే ఛాన్సులే ఉన్నాయి. ఏదేమైనా.. కేసీఆర్‌కు గతంలో ఉన్న పరిస్థితి గ్రేటర్‌లో లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏం చేస్తారో చూడాలి.
-Vuyyuru Subhash