భద్రాద్రి రామయ్య సల్లంగ సూడాల
యాదాద్రి నర్సన్న వరాలు ఇయ్యాల
వేములాడ రాజన్న సిరి సంపద ఇయ్యాల
సమక్క సారక్కలు సల్లంగ సూడాల
కోటి దేవతలున్న తెలంగాణకు మనమంతా
వందనాలు చెల్లించాల..
విన్నపాలు వినవలే వింత వింతలూ పన్నగపు దోమతెర పైకెత్తు వేళ.. అన్న పాట వింటూ వింటూ రామయ్యను మొక్కుకోండి.. ఆయన దర్శన భాగ్యం కావాలని కోరుకోండి.. కోరినంతనే గుండెల్లో కొలువుండే గొప్ప శక్తి ఆ రామయ్య.. గోదావరి నదీ తీరాల చెంత పావన భద్రాద్రి చెంత రామయ్యను కొలవండి.. రామయ్య పాదాలను కడిగి పుణ్య తీరాల చెంత పునీతులు కండి.. అని విన్న ఆ వృద్ధులకు కనులారా రామయ్యను కొలిచే భాగ్యం ఇచ్చారు సజ్జనార్.. థాంక్ యూ సర్.. మా ఊరి బిడ్డలకు
ఇంత మంచి భాగ్యం కల్పించినందుకు.. మా ఊరు అంటే శ్రీకాకుళం అని!
అవును! తల్లీ తండ్రీ ఒంటరి అయిపోతారు.. తల్లీ తండ్రీ కొంత కాలానికి అవసరం లేకుండా పోతారు.. కొందరు వృద్ధులకు ఆ అవసాన దశలో రామయ్యను చూడాలని ఉంటుంది. అలాంటి సందర్భంలో తన ఆలనా పాలనలో ఉన్న వృద్ధులకు రామయ్య దర్శనం ఇప్పించాలని ఓ యువకుడు సంకల్పించాడు. ఆయన పేరు సాలూరు సిద్ధార్థ.. ఊరు శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస మండలం, వెదుళ్లవలస గ్రామం. ఎలా అయినా ఆ వృద్ధుల కోరిక తీర్చాలని సంకల్పించాడు.
సంకల్పం గొప్పది కదా! రామయ్య అనుగ్రహం వచ్చింది.. సజ్జనార్ సర్ ను తెలిసిన వారి ద్వారా సంప్రదిస్తే.. ఆయన వెంటనే స్పందించారు. మీ వెంట నేనున్నా అని భరోసా ఇచ్చారు. విశాఖ నుంచి భద్రాద్రికి, భద్రాద్రి నుంచి తిరిగి విశాఖకు ఓ బస్సు ఏర్పాటు చేసి ఉచితంగానే వారిని తీసుకువచ్చి
తిరిగి వారిని క్షేమంగా గమ్య స్థానానికి చేర్చి అందరి ప్రశంసలు అందుకున్నారు.
భద్రాద్రి రామయ్యకు వందనాలు చెల్లించాలి.. భద్రాద్రి రామయ్యను ప్రేమించిన సందర్భాలను మరోసారి తల్చుకోవాలి.. బిడ్డలు లేక ఉన్నా వారు పట్టించుకోక అవస్థలు పడుతున్న వృద్ధులకు సాయం చేసి, రామయ్య దర్శనం ఇప్పించిన టీఆర్టీసీ పెద్ద దిక్కు సజ్జనార్ సర్ కు వందనాలు చెల్లించాలి. ఇప్పుడు రామయ్య దర్శనంతో మా శ్రీకాకుళం వృద్ధులు పొంగిపోతున్నారు. ఆ పాటి సాయం చేసి, గొప్ప ఆనందాలు మిగిల్చిన తెలంగాణ ఆర్టీసీ బృందాలకు మా శ్రీకాకుళం తరఫున మరో మారు కృతజ్ఞతలు.
– రత్నకిశోర్ శంభుమహంతి, శ్రీకాకుళం దారుల నుంచి…