కేసిఆర్ వరద సాయం.. టిఆర్ఎస్ కార్యకర్తలకే పరిహారం..?

ఇటీవలే కురిసిన భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల నష్టం ఏర్పడింది. అయితే ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని వరద బాధితుల సహాయార్ధం తక్షణ సహాయం కింద 550 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి తాజాగా ఇదే విషయంపై స్పందించిన మాజీ ఎంపీ మధుయాష్కి విమర్శలు గుప్పించారు.

రాష్ట్రం మొత్తం భారీ వర్షాల కారణంగా నష్టం వాటిల్లితే కేసీఆర్ సర్కార్ మాత్రం కేవలం హైదరాబాద్ నగర వాసులకు మాత్రమే వరద నష్టం నిధులు విడుదల చేయడం వెనుక పెద్ద కుట్ర ఉంది అంటూ మధుయాష్కీ విమర్శించారు. రానున్న రోజుల్లో జిహెచ్ఎంసి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి కేవలం హైదరాబాద్ వరద బాధితులకు మాత్రమే కేసిఆర్ నిధులు విడుదల చేశారు అంటూ ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ వరద బాధితులకు ప్రకటించిన పది వేల రూపాయల సహాయం కేవలం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని విమర్శించిన మధుయాష్కి… వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు మాత్రం సహాయం అందడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.