టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు.. గురించి టీడీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫైర్‌బ్రాండ్‌లా చిటపటలాడిన ఆయన గత ఎన్నికల్లో ఓడినా ఆయన రేంజ్ పెరిగిందే తప్పా తగ్గలేదంటున్నారు. గత ఏడాది ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీనికితోడు.. ఆదిలో ఆయనను పార్టీ కూడా పట్టించుకోలేదు. దీంతో వైసీపీలోకి చేరిపోతారనే ప్రచారం కూడా సాగింది. ప్రధాన మీడియాలోనే ఆయనపై కధనాలు వచ్చాయి. కానీ, ఇంతలో ఏం జరిగిందో ఏమో.. ఆయన మాత్రం టీడీపీలోనే ఉన్నారు. ఇటీవల టీడీపీ పదవుల్లో పార్లీ పొలిట్ బ్యూరో లోనూ ఛాన్స్ సంపాయించుకున్నారు.
అత్యంత కీలకమైన ఈ పదవిని దక్కించుకున్న తర్వాత ఆయన రేంజ్ మరింత పెరిగిందని పార్టీ నేతలు అంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఫైర్ బ్రాండ్ నాయకుడిగా బొండాకు పేరుంది. అసెంబ్లీలో కూడా ఆయన దూకుడుగా వ్యవహరించారు. అరెయ్.. వొరెయ్! అంటూ.. వైసీపీ నాయకుడు… ప్రస్తుత మంత్రి కొడాలి నానిపై సభలోనే విరుచుకుపడ్డారు. ఇక, అప్పటి నుంచి పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు.
అప్పట్లో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నా.. టీటీడీ బోర్డు సభ్యత్వంతో చంద్రబాబు సరిపెట్టారు. దీంతో చంద్రబాబు కాపుల గొంతు కోశారంటూ ఓపెన్‌గానే విరుచుకు పడ్డారు.
ఇక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడినా కూడా పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపిస్తున్న వారిలో బొండా ఉమా ప్రధమ వరుసలో నిలుస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంలోను, చంద్రబాబుపై మచ్చ పడకుండా చూసుకోవడంలోనూ ఆయన తన వాయిస్ వినిపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ దూకుడు మరింతగా పెరిగింది. పైగా నియోజకవర్గం ప్రజలకు ఆయన నిత్యం అందుబాటులో ఉంటున్నారు.
ఇప్పటికి ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు బొండాను ఆశ్రయిస్తున్నారంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. ఈ పరిణామాలను గమనిస్తున్న టీడీపీ సీనియర్లు.. బొండా ఉమా రేంజ్ ఏమాత్రం తగ్గలేదని.. అప్పట్లో కంటే కూడా ఇప్పుడు మరింతగా పెరిగిందని చెబుతున్నారు. ఇదే కంటిన్యూ చేస్తే బొండా ఫ్యూచర్‌లో పార్టీలో మరింత కీలకంగా మారడంతో పాటు.. కాపు నేతల్లో పార్టీకి ఆయనే ఓ ఐకాన్ అయ్యే ఛాన్సులే ఉన్నాయి.