సాధారణంగా ఏ మంత్రి అయినా.. మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. తనకు తెలిసిన విషయాలతోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. లేదా.. తాను మాట్లాడాలని అనుకున్న విషయంపై ముందుగానే ప్రపేరై వస్తారు. లేకపోతే.. ఇప్పుడున్న మీడియా వ్యవస్థలో అడ్డంగా దొరికి పోవడం ఖాయం. ఇలానే ఇప్పుడు వ్యవసాయ మంత్రి కన్నబాబు మీడియాకు అడ్డంగా చిక్కారు. చివరికి సిగ్గుపడుతూ.. మీడియా మీటింగ్‌ను ముగించారు. తాజాగా రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశం వివరాలను సాధారణంగా కేబినెట్ వ్యవహారాలు చూస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాకు వివరించాలి.
అయితే.. ఢిల్లీ పర్యటనలు.. ఇతరత్రా.. బిజీ కారణంగా ఆయన మీడియాకు బైట్ ఇవ్వలేక పోయారు. ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన కన్నబాబు.. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తును ఎట్టిపరిస్థితిలోనూ తగ్గించేది లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఎట్టిపరిస్తితిలోనూతమ ప్రభుత్వమే పోలవరం కడుతుందని అన్నారు. అయితే.. ఈసందర్భంలో మీడియా మిత్రులు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. సార్.. ఎత్తు గురించి కాదు సార్.. నీటి నిల్వను ఏ రేంజ్లో ఉంచుతారో చెప్పండి ? వాస్తవానికి 45 మీటర్ల ఎత్తులో ఉండాలి. కానీ, మీ ప్రభుత్వం దీనిని 41 మీటర్లకే పరిమితం చేస్తోందని అంటున్నారు.
అని ప్రశ్నించారు. దీంతో కన్నబాబు ఏం చెప్పాలో తెలియక కొద్దిసేపు నీళ్లు నమిలారు. మరోసారి మీడియా మిత్రులు అదే ప్రశ్న మళ్లీ సంధించారు. దీంతో నాకు తెలియని అంశంపై నన్ను గుచ్చి గుచ్చి అడిగి ఖరాబ్ చేయొద్దు..! అని విసుగు ప్రదర్శించారు. అంతేకాదు.. నేను లోకేష్ స్థాయిలో మాట్లాడుతున్నా.. అంటూ.. మీడియా మీటింగ్‌నుంచి రుసురసలాడుతూ వెల్లిపోయారు. కట్ చేస్తే.. నిజానికి వ్యవసాయ మంత్రే అయినప్పటికీ.. కన్నబాబుకు పోలవరం పై అవగాహన లేదు. దీంతో ఆయన పోలవరంపై పెద్దగా దృష్టి పెట్టకుండా ఉంటే బాగుండేదని అనవసరంగా కెలికి మీడియాకు బుక్కయిపోయారని.. వైసీపీ నేతలు గుసగుసలాడడం కనిపించింది.