ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో ఇక నుంచి అన్ని దేశాలు కూడా కరోనా కట్టడి విషయంలో మాస్క్ లు తప్పనిసరి అని భావిస్తున్నాయి. మాస్క్ లేకుండా బయటకు వస్తే కచ్చితంగా జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మన దేశంలో మాస్క్ అవసరం గురించి ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కింది స్థాయి వరకు అందరూ కూడా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనితో మాస్క్ అవసరం అని జనాలు మాస్క్ ల కోసం క్యూ కడుతున్నారు. అయితే మాస్క్ ల ధరలు మాత్రం తీవ్రంగా ఉంటున్నాయి బయట. ఇక ఎన్95 మాస్క్ సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో అద్భుతమైన మాస్క్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు అహ్మదాబాద్ లో. అహ్మదాబాద్ జౌళి పరిశ్రమ పరిశోధన సమాఖ్య (ఏటీఐఆర్‌ఏ) సమర్థంగా వైరస్‌ల నుంచి రక్షణ కల్పించే ఎన్-99 మాస్కులను అభివృద్ధి చేసింది.
రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్‌డీవో)తో కలిసి ఇందుకోసం ప్రత్యేక వస్త్రాన్ని ఉత్పత్తి చేసారు. దీనిపై సంస్థ డైరెక్టర్ దీపాలి పలావత్… అధిక డిమాండ్ ఉన్న ఎన్-95 మాస్కులు 95 శాతం వరకు సూక్ష్మ గాలి కణాలను నిరోధిస్తుండగా, ఎన్-99 మాస్కులు 99 శాతం వరకు నిరోధిస్తాయని, ఈ కొత్త మాస్కులో ఐదు పొరలు ఉంటాయని పేర్కొన్నారు. లోపలివైపు రెండు సూక్ష్మ మెస్‌లు, బయట వైపు మూడు వస్త్ర పొరలు ఉండగా డబ్ల్యూహెచ్‌వో నిర్దేశాల ప్రకారం వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.