గత 70 రోజులుగా అత్తారి బార్డర్‌లో పాకిస్తాన్‌కు చెందిన దంపతులు చిక్కుపోయారు. డిసెంబర్ 2న వారికి బిడ్డ జన్మించింది. సరిహద్దుల్లో ప్రసవించడంతో ఆ పసికందుకు తల్లిదండ్రులు బార్డర్ అని పేరు పెట్టారు.
పంజాబ్ ప్రావిన్స్ రాజన్‌పూర్ జిల్లాకు చెందిన నింబు బాయి, బాలమ్ రామ్ మరో 97 మంది పాకిస్తాన్ పౌరులతో కలసి గత 70 రోజులుగా బార్డర్‌లో గడుపుతున్నారు. డిసెంబర్ 2న నిండు గర్భిణి అయిన నింబు బాయికి పురిటి నొప్పులు వచ్చాయి. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన పలువురు మహిళలు వచ్చి ఆమెకు కాన్పు చేశారు. ఆమెకు పండంటి బిడ్డ పుట్టింది. తల్లి, బిడ్డ సంరక్షణ కోసం అవసరమైన వైద్య సదుపాయాలను స్థానిక ప్రజలు కల్పించారు. సరిహద్దుల్లో జన్మించడంతో ఆ బిడ్డకు తల్లిదండ్రులు ముచ్చటగా బార్డర్ అని పేరు పెట్టుకున్నారు.
భారత్‌లో తీర్థయాత్రల సందర్శన కోసం నింబు బాయి, బాలమ్ రామ్ పాకిస్తాన్ నుంచి వచ్చారు. తిరిగి స్వదేశానికి వెళ్లడానికి అవసరమైన పత్రాలు లేకపోవడంతో సరిహద్దుల్లో చిక్కుకుపోయారు. సరిహద్దుల్లో చిక్కుకుపోయిన 97 మందిలో 47 మంది వరకు పిల్లలు ఉన్నారు. అందులో దాదాపు ఆరుగురు ఏడాది లోపు చిన్నారులు ఉన్నారు.