ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ చివరిలో ఏర్పడనుంది. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ.. కనబడకుండా పోవడం వలన సూర్య గ్రహణం ఏర్పడుతుంది. సూర్య గ్రహణం అమావాస్య (Amavasya) రోజున ఏర్పడుతుంది. ఆ రోజు కొన్ని చేయకూడని పనులు ఉంటాయి., మొదలుపెట్టకూడనవి ఉంటాయి. మరి ఈ ఏడాది వచ్చే సూర్యగ్రహణం ఎలా ఉండబోతుందో చూద్దామా..!
సనాతన ధర్మం ప్రకారం.. గ్రహణాలను అశుభ సూచకంగా భావిస్తారు. అందుకే సూర్యగ్రహణం ఏర్పడే సమయంలో జీవితంలో ఆనందం, శాంతి ఉండడం కోసం కొన్ని పూజలను , పరిహారాలను చేస్తుంటారు.
భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 30న గ్రహణం ఏర్పడనున్నది. మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 4:7 గంటల వరకు ఇది కొనసాగుతుంది. భారత దేశంలో పాక్షికంగా ఉంటుంది. సూర్య గ్రహణం కనిపించే దేశాలలో దక్షిణ, పశ్చిమ అమెరికా, పసిఫిక్ అట్లాంటిక్ , అంటార్కిటికాలు కాగా భారతదేశంలో ఈ గ్రహణం ప్రభావం చాలా తక్కువగా ఉండనుంది. అయినప్పటికీ సూర్యగ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకుండా ఉండడం మంచిదని చెబుతున్నారు.
గ్రహణ సమయంలో చేయకూడని పనులు:
1. గ్రహణం సమయంలో ప్రతికూల శక్తి పెరగడం మొదలవుతుంది. ఈ సమయంలో ఏదైనా శుభ కార్యం చేయడం హానికరం. గ్రహణ కాలంలో గృహ ప్రవేశం లేదా మరేదైనా శుభకార్యాలు నిర్వహించాలని భావిస్తే… వాయిదా వేసుకోవడం మంచిది. అయితే గ్రహణ సమయంలో పూజలు చేయడం మంచిది.
2. గ్రహణ సమయంలో ఏ విధమైన పదునైన వస్తువులను ఉపయోగించి పనులు చేయకూడదని శాస్త్రాలలో పేర్కొన్నారు. . గర్భిణీ స్త్రీలే కాదు, ఈ సమయంలో ఎవరూ సూదిలో దారం ఎక్కించడం, కుట్టుపని చేయడం, కత్తి, కత్తెర వంటి వాటిని ఉపయోగించడం అశుభం అని నమ్ముతారు. గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి కత్తి, పదునైన వస్తువులు వాడకూడదని చెబుతున్నారు. దీని వల్ల పుట్టబోయే బిడ్డకు మంచిది కాదని నమ్మకం.
3. గ్రహణ సమయంలో ప్రయాణం చేయకూడదని శాస్త్రాల్లో పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రయాణం అశుభం. పెద్ద నష్టాలను కలిగిస్తుంది.