రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమదే విజయం అని.. రాబోయే కాలంలో తానే కాబోయే ముఖ్యమంత్రి అని.. జగన్ ను గద్దెదింపే సత్తా జనసేనకు ఉందని ఈమధ్య మరీ బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కల్యాణ్. అయితే అది వేదికలపై మాటలకే పరిమితమా లేక గ్రౌండ్ లెవెల్లో పనులు కూడా అలానే ఉంటాయా అన్నది కీలకం! ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే… ముందు తమ ఎన్నికల గుర్తును సంపాదించుకుంటే అదే పదివేలనే పరిస్థితి ఇప్పుడు జనసేనకు వచ్చింది!
అవును.. తొందరలోనే బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడనుంచి పోటీచేసి జగన్ మెజారిటీ తగ్గించాలని జనసేన బలంగా భావిస్తోంది! అయితే విచిత్రంగా ఇప్పుడు పవన్ కు గ్లాస్ సింబల్ దెబ్బకొట్టేపరిస్థితి ఎదురైంది. జనసేన చెప్పుకుంటున్న గాజు గ్లాసు గుర్తును ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే జనసేన అభ్యర్థి కన్నా ముందే ఎవరైనా ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి గాజు గ్లాసు గుర్తు కావాలని అడిగితే… ఎన్నికల కమీషన్ వెంటనే కేటాయించేస్తుందన్నమాట.
గత తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్ధికి కేంద్ర ఎన్నికల కమీషన్ గాజుగ్లాసు గుర్తును కేటాయించింది. తమపార్టీ ఎన్నికల గుర్తును ఇండిపెండెంట్ కు కేటాయించటాన్ని పవన్ అభ్యంతరం వ్యక్తంచేసినా.. ఆ అభ్యంతరాన్ని కమీషన్ కొట్టేసింది. జనసేన అనేది రిజిస్టర్డ్ పార్టీయే కానీ రికగ్నైజ్డ్ పార్టీ కాదని స్పష్టం చేసింది. దీంతో.. ఇప్పుడు బద్వేల్ లో కూడా అదేపరిస్థితి ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు.
పవన్ గనుక తొందరపడకపోతే మళ్ళీ తన పార్టీ గుర్తుగా చెప్పుకుంటున్న గాజుగ్లాసు మళ్ళీ వాళ్ళ నుండి చేజారిపోవడం ఖాయం. సో… గెలుపోటముల సంగతి దేవుడెరుగు కానీ ముందుగా గ్లాస్ సింబల్ ని కాపాడుకోవడంలో పవన్ ముందడుగు వేయాలి. ఆ సింబల్ మరోసారి తన చేయిజారకుండా చూసుకోవాలి. అలా కానిపక్షంలో… గాజుగ్లాసు గుర్తు విషయంలో మరోమారు అవమానం తప్పదని గుర్తుంచుకోవాలి!