సంక్రాంతి పండగ దృష్ట్యా రవాణా వ్యవస్థ ఇప్పుడు బిజీ బిజీగా మారిపోయింది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉంది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కేరళ రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ఎక్కువగా ఉంది. దీనితో రైళ్ళు, బస్సులు అన్ని కూడా కిటకిటలాడిపోతున్నాయి. ఈ నేపధ్యంలో చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా మెట్రోరైళ్లలో 50 శాతం రాయితీ టికెట్ రుసుముతో ప్రయాణం చేయవచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. చెన్నై నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది. దీనితో మెట్రో రైల్ యాజమాన్యం ట్రాఫిక్ తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఆదివారం సహా ప్రభుత్వ సెలవు దినాల్లో మెట్రో యాజమాన్య౦ 50 శాతం రాయితీని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 15, 16, 17 తేదీలు ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో ఆ మూడు రోజులు 50 శాతం రాయితీతో ప్రయాణించే సదుపాయం కల్పించారు. అదే విధంగా 17వ తేదీ కనుమ సందర్భంగా చెన్నై మెరీనా బీచ్ నుంచి మెట్రో రైల్వేస్టేషన్లకు ప్రత్యేక క్యాబ్ వసతి కూడా ఏర్పాటు చేసారు అధికారులు. ప్రభుత్వ ఎస్టేట్, డీఎంఎస్ మెట్రో రైల్లేస్టేషన్ల నుంచి మెరీనా బీచ్‌కు క్యాబ్ వసతి కల్పించనున్నట్లు తెలిపారు.