భైంసా అల్ల‌ర్ల‌లో రోహింగ్యాల హ‌స్తం

-

భైంసా… ఈ పేరు వింటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో తెలియ‌ని అల‌జ‌డి. అస‌లు అక్క‌డ ఏం జ‌రుగుతుందో తెలియ‌డంలేదు. తెలుసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తే స‌మాచారాన్ని నొక్కిపెడుతున్నారు.. కానీ ఏదో జ‌రుగుతోంది.. వారికి ఎవ‌రో మ‌ద్దుతినిస్తున్నారు. లేదంటే అంత విచ్చ‌ల‌విడిగా దాడుల‌కు పాల్ప‌డే ధైర్యం చేయ‌రు. ఇంట్లో పొయ్యి వెలిగించ‌డానికి అగ్గిపుల్ల గీసిన‌ప్పుడు వ‌చ్చే మంట కూడా మ‌నుషుల మ‌ధ్య నిప్పు రాజేస్తుందేమోన‌న్న భ‌యం..  ఎప్పుడు ఎక్క‌డ ఏ వివాదం త‌లెత్తుతుందో.. ఎక్క‌డ మంట‌లు చెల‌రేగుతాయో.. ఎక్క‌డ పోలీసుల బూట్ల చ‌ప్పుడు వినిపిస్తుందోన‌ని భైంసా ప్ర‌జ‌లు హ‌డ‌లిపోతున్నారు.

పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్

భైంసా అల్లర్ల ఘటన రోజురోజుకూ మ‌లుపులు తిరుగుతోంది. భార‌తీయ జ‌న‌తాపార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవికి బెదిరింపు కాల్స్ రావడం ఇప్పుడు సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. పాకిస్తాన్ నుంచి కాల్ చేసి చంపేస్తామని బెదిరించారని.. రక్షణ క‌ల్పించాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించడంతో క‌ల‌క‌లం రేగింది. పాకిస్తాన్ కోడ్ నెంబ‌ర్ 92తో ప్రారంభ‌మ‌య్యే నెంబ‌ర్ నుంచి కాల్స్ వ‌చ్చిన‌ట్లు ర‌మాదేవి త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. భైంసా అల్లర్ల ఘటనలో పాకిస్తాన్ పేరు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. ఎటునుంచి ఎటువైపున‌కు దారితీస్తుందో అర్థంకాకుండా ఉందంటూ ప్ర‌జ‌లు వాపోతున్నారు.

 

ఎంఐఎంకు వ్య‌తిరేకంవ‌ల్లే

భైంసాలో ఎంఐఎం నేతల అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినందువ‌ల్లే పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రమాదేవి ఆరోపించారు. ఈ నెల 12 వతేదీ అర్ధరాత్రి 12:57 నుంచి వరుసగా మూడు సార్లు 92 3481411535 నెంబ‌రు నుంచి వాట్సాప్ కాల్స్ వచ్చాయని తెలిపారు. నిద్ర‌లో ఉండ‌టంవ‌ల్ల ఫోన్ ఎత్తలేదని.. మరుసటి రోజు ఉదయం 10:34కి వీడియో కాల్ వచ్చిందని.. భార‌త‌దేశాన్ని తిడుతూ.. తనను తీవ్రంగా దుర్భాషలాడారని.. చంపేస్తానని బెదిరించారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ర‌మాదేవి ఫిర్యాదులో కోరారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా తనను బెదిరించారని,  భైంసా అల్లర్లలో రోహింగ్యాల హస్తం ఉందంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. అల్లర్లకు సంబంధం లేని అమాయక హిందువులను అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారని,   మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన త‌ర్వాతే అరెస్ట్ చేసిన హిందువుల సంఖ్య పెరిగిందని,  వారిని వెంట‌నే విడుదల చేయకుంటే ప్రజా ఉద్యమం చేస్తామని రమాదేవి హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news