కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను భయపెట్టాలని ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. దేశంలో హింస, ద్వేషంతో కూడిన రాజకీయాలు జరుగుతున్నాయని, 2024లో బీజేపీ దేశంలోనే కనిపించదని ఆమె ఆరోపించారు. మంగళవారం మీడియా సమావేశంలో బీజేపీ ప్రభుత్వ వ్యవహారంపై విమర్శించారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష పార్టీలపైనే దాడులు చేస్తాయా..? అధికార పార్టీ బీజేపీ నేతలపై దాడులు నిర్వహించదా..? దేశాన్ని నాశనం చేస్తోంది బీజేపీ. డీమానిటైజేషన్ వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైన విషయం గుర్తుకు లేదా..? డీమానిటైజేషన్ ఒక పెద్ద స్కామ్ అని అందరికీ తెలుసు. అయినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. నేను వీటికి భయపడను. ప్రజా సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోరాడుతా..’’ అని ఆమె పేర్కొన్నారు.
కాగా, ఇటీవల వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే బిహార్ నేత లాలూ ప్రసాద్ యాదవ్, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, ఢిల్లీ ఆప్ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్‌లపై కేసులు నమోదు చేసింది.